కలం, కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. వర్షాలు లేక సాగు నీటి కోసం రైతులు తండ్లాడుతుంటే కేసీఆర్‌పై కక్షతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు రైతులను ముంచుతున్నారని ఆగ్రహించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జడ్పీటీసీ గంట రాములుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు అలా తెరిచి ఉండగానే.. కన్నెపల్లి పంపు హౌజ్ పంపులు ఆన్ చేసి అక్కడ వృధాగా సముద్రంలో కలవడానికి వెళుతున్న లక్ష క్యూసెక్కుల నీటిని ఒడిసి పట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్లు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, మేడిగడ్డ బ్యారేజీకి కన్నెపల్లి పంపు హౌజ్‌కు మధ్య దాదాపుగా 13కిలో మీటర్ల వరకు దూరం ఉంటుందన్నారు. ఆదివారం ఇదే విషయాన్ని కేటీఆర్ యావత్ ప్రపంచ మీడియాకు చూపించారన్నారు.
కన్నెపల్లిలోని లక్ష్మీ పంపు హౌజ్ పంపులను ఆన్‌చేసి తెలంగాణలోని చెరువులు కుంటలు, ప్రాజెక్టులను నింపవచ్చన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు పిచ్చి పట్టినట్లుగా కాళేశ్వరంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై కోసంతో, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ధ్వేషంతో తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నారన్నారు. వర్షాలు లేక రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తుంటే నీరెత్తిపోయలేక నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నీళ్లెత్తిపోస్తే భద్రాచలం కొట్టుకుపోతుందనడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ హయాంలో పంపుల ద్వారా ముందస్తుగా నీళ్లు నింపుకునేదని వివరించారు.
నీళ్లు వృథాగా పోతున్నా కాళేశ్వరంపై విషం కక్కుతూ రైతులను ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్య పెడుతూ కాలం గడుపుతున్నారన్నారు. కాళేశ్వరం అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే కాళేశ్వరం.. అందుకే కాళేశ్వరం పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని, 3 బ్యారేజీలు, 21 పంప్ హౌజ్ లు, ఇలా అనేక సమూహాల కలయికే కాళేశ్వరం అన్నారు. ఒక్క రెండు పిల్లర్లు కుంగిపోయిన సాకు చూపించి రైతులను గోస పెడుతున్నారన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో ఎక్కడా కాళేశ్వరంపై వ్యతిరేకంగా నివేదిక ఇవ్వలేదన్నారు.
కాళేశ్వరం రిపేర్ కావద్దు.. రైతులకు నీళ్ళివ్వద్దు.. అనేదే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదమని ఈశ్వర్ ఎద్దేవా చేశారు. 250టీఎంసీల నీటి ప్రవాహానికి తట్టుకొని నిలిచింది మేడిగడ్డ బ్యారేజ్ అన్నారు. రాష్ట్రంలో పోలవరంలో కాపర్ డ్యాం కొట్టుకుపోతే.. ఎన్డీఎస్ఏ రాదు.. కేవలం కాళేశ్వరంకు మాత్రమే రావడంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఎస్ఎల్బీసీ కూలి 8 మంది చనిపోతే ఇప్పటి వరకు వారి శవాలను కూడా చూపించలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఎల్‌నినో విపత్తు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా.. కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదన్నారు. రెండేండ్లు కాళేశ్వరం పంప్ హౌజ్‌లు ఆన్ చేయకున్నా.. వర్షాలతో రైతులు సాగు చేసుకున్నారన్నారు. కానీ ఇప్పుడు ఎల్‌నినో విపత్తు వస్తున్నా కాళేశ్వరం పంపులు ఆన్ చేయరా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌజ్‌లు ప్రారంభించి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లక్ష మంది రైతులతో వెళ్లి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ వచ్చింది గోదావరి ఎండింది..
“గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గోదావరి ఎడారిగా మారి ఉండేది. బీఆర్ఎస్ పాలనలో నిండుకుండలా ఉన్న గోదావరిలో తెప్పల పోటీలను నిర్వహించాం. యావత్ మత్స్యకారులకు ఉపాధి మార్గాలను చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. గోదావరి ఎండింది. ఇప్పుడు ఆ గోదావరిలో క్రికెట్ ఆడుతున్నరు. పాత రోజులు వచ్చి మళ్లీ ‘తలాపున పారుతుంది గోదావరి అంటూ.. నీ సేను నీ సెలుకా ఎడారి..’అనే పాటలు తెలంగాణ రాకముందు పాడినట్లుగా పడుకునే పరిస్థితులు వచ్చాయి. రైతులు నీళ్ళకోసం ఎదురుచూస్తున్నా కాంగ్రెస్ సర్కార్‌కు చీమ కుట్టినట్టు కూడా కావడం లేదు” – కోరుకంటి చందర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ పేరును బద్నాం చేయడానికే నీళ్లివ్వడం లేదు..
“తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. అలాంటి ప్రాజెక్టుకు చిన్న చిన్న రిపేర్లు చేసి నడిపించాల్సింది పోయి.. ఆయన పేరును బద్నాం చేయడానికే నీళ్లివ్వడం లేదు. నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే రైతులను గోస పెడుతున్నది. కాళేశ్వరం నీళ్లు సరిగా వాడుకుంటే ఇప్పటికే నల్గొండ వరకు నీళ్లు చేరేవి. 70 లక్షల మంది రైతులకు నష్టం జరిగినా మంచిదే కానీ కాళేశ్వరం నీళ్లు మాత్రం ఇవ్వం అన్నట్టుగా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. రాబోవు రోజుల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం” – మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నిరివ్వాలి..
“మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృధగా పోతున్నది. రైతులు సాగు నీరు లేక విలవిల్లాడుతున్నారు. రైతుల పాపం ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి సందర్శనతో ప్రజలు వాస్తవాలు తెలిసిపోయాయి. ప్రభుత్వ బండారం బట్టబయలయ్యింది. నీళ్ళిస్తారని రైతులు ఆశతో చూస్తున్నారు. కాళేశ్వరం కూలింది అని నీళ్ళివ్వకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ నేతలు కళ్ళు తెరిచి రైతులకు నీళ్ళివ్వాలి. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెబుతారు” -మాజీ ఎమ్మెలే పుట్ట మధుకర్

