కలం, నిజామాబాద్ బ్యూరో : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య.. ఈ దారుణమైన ఘటన (Husband Murder) నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ (35) ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్ళాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ జూన్ 27న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.
అయితే, అతని భార్య దాయిని సంధ్యకు నిజామాబాద్ ఇంద్రపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రశాంత్ రాకతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన సంధ్య, ప్రియుడు అనిల్ తో కలిసి భర్త ప్రశాంత్ హత్యకు ప్లాన్ చేసింది.
దీంతో అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయాన్ని కోరారు. పథకం ప్రకారం.. జూన్ 29న వెంకటసాయి ప్రశాంత్ కు పరిమితికి మించి మద్యం తాగించి డాబా పైకి తీసుకెళ్లాడు. సంధ్య ఫోన్ లో సూచనలు ఇస్తుండగా ప్రశాంత్ ను వెంకటసాయి డాబా పైనుంచి కిందకు నెట్టేశాడు.
తీవ్ర గాయాలైనప్పటికీ ప్రశాంత్ చనిపోక పోవడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య, వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రశాంత్ ను చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. చికిత్స అనంతరం రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ ప్రశాంత్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
ప్రియుడు అనిల్ సూచనతో సంధ్య తన భర్త ప్రశాంత్ చేతికి ఉన్న సెలైన్ ద్వారా మత్తు మందులు, టాయిలెట్ క్లీనర్ కలిపిన ద్రావణాన్ని శరీరంలోకి ఎక్కించింది. ఆపై మంచంపై నుంచి కిందకు తోసి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది.. అయితే, ప్రశాంత్ మృతి వార్త తెలుసుకున్న అతని తల్లికి అనుమానం వచ్చింది.
ప్రశాంత్ ను హత్య చేశారని భావించిన ఆమె.. తన కోడల్ని అనుమానించింది. ఊరు వచ్చిన విషయం గానీ, మరణించే వరకు జరిగిన విషయాలు గానీ కోడలు తనకు చెప్పకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్య సంధ్యను విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో సంధ్యతో పాటు ఆమె ప్రియుడు అనిల్, మరో వ్యక్తి వెంకటసాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

