కలం, కరీంనగర్ బ్యూరో: కార్పొరేటర్లకు, కో ఆప్షన్ సభ్యులకు ఫోన్ కొనుగోలు టెండర్ కు 28 లక్షల రూపాయల టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం (CPM) నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాసులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. ప్రజలు నీటి పన్ను, చెత్త పన్ను, ఇంటి పనుల ద్వారా చెల్లించిన డబ్బులతో కార్పొరేటర్లకు మొబైల్ కొనుగోలు చేయడమేంటని ప్రశ్నించారు. వెంటనే ఈ టెండర్ ను రద్దు చేయాలని అన్నారు.
కార్పొరేటర్లకు ఇన్నోవా కొనుగోలు చేయడానికి స్తోమత ఉంది గాని సెల్ ఫోన్లు లేవా? ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కార్పొరేటర్లకు ఫోన్లు ఎలా కొనిస్తారని ప్రశ్నిస్తారు. ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి, ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉన్నాయని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి చర్యలను విరమించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని, చాలీచాలని జీతంతో బ్రతుకుతున్నారని అన్నారు.
అవసరమనుకుంటే మున్సిపల్ కార్మికులందరికీ కార్పొరేషన్ నిధుల నుండి ఫోన్లు కొనివ్వాలి గాని, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కార్పోరేటర్లకు ఎందుకు ఫోన్లు కొనిస్తారని ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేసే అంతవరకు సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా కార్పోరేటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫోన్ కొనుగోలు టెండర్‌ను రద్దుచేసి ప్రజాధనాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయికంటి శ్రీనివాస్, ఆర్. శ్రీనివాస్, డి.శ్రీకాంత్, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

