కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్-16లో ఇంగ్లండ్(England) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మెక్సికోపై (Mexico) 3-2తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్, మెక్సికో యువ ఆటగాడు గిల్బర్టో మోరాతో జెర్సీ మార్చుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్టాడియో అజ్టెకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్లింగ్‌హామ్ చెలరేగి ఆడాడు. తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్‌కు బలమైన ఆధిక్యం అందించాడు. అనంతరం హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా మరో గోల్ చేయడంతో ఇంగ్లండ్ 3-0తో ముందంజ వేసింది. మెక్సికో తరఫున జూలియన్ క్వినోనెస్, రౌల్ జిమెనెజ్ చెరో గోల్ చేసి పోరాడినా ఫలితం దక్కలేదు.
54వ నిమిషంలో జారెల్ క్వాన్సా రెడ్ కార్డు చూడటంతో ఇంగ్లండ్ (England) దాదాపు మొత్తం రెండో అర్ధభాగాన్ని 10 మంది ఆటగాళ్లతోనే ఆడింది. అయినప్పటికీ గోల్‌కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్‌తో పాటు రక్షణ విభాగం సమర్థంగా ఆడి విజయాన్ని కాపాడింది. మ్యాచ్ అనంతరం బెల్లింగ్‌హామ్ మాట్లాడుతూ ఇంగ్లండ్ తరఫున ఆడటం తనకు గర్వకారణమని, ఇలాంటి విజయాలు దేశ ప్రజలను ఒకే భావంతో కలుపుతాయని అన్నారు. అలాగే 23 సంవత్సరాల 6 రోజుల వయసులో ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి కొత్త రికార్డు సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లండ్ నార్వేతో తలపడనుంది.
Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

