కలం, వెబ్ డెస్క్: హమాలీ కార్మికులకు ఆరోగ్య భద్రతతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా నెరవేర్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన హమాలీ యూనియన్ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలీలను విస్మరిస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీకి సంచులు మోస్తున్న రేవంత్..
హమాలీ కూలీలు వడ్ల బస్తాలు మోసి కష్టపడితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంచులు మోస్తూ కష్టపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ ఏ సంచులు మోస్తున్నాడో తన కంటే కూలీలకే బాగా తెలుసు అని చెప్పారు. ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం డబ్బుల మూటలు మోసి మోసి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను తొక్కుతున్నాడని.. నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడని, రైతులను అరిగోస పెడుతున్నాడని మండిపడ్డారు.
భూముల ధరలు పడిపోయాయి..
బీఆర్ఎస్ హయాంలో ఉన్న రేట్లు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములకు పూర్తిగా ధరలు పడిపోయిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. గతంలో హమాలీలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దయతో 8 రూపాయలు ఉన్న రేట్లను 26 రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పారు. గతంలో ఐదేళ్ల ఒకసారి రేట్లు పెరిగితే, కేసీఆర్ వచ్చాక రెండేళ్ల ఒకసారి రేట్లు పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నామని హమాలీ కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
ఈరోజు 18వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని హమాలీలు ఆహ్వానించారని చెప్పారు. ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం తధ్యమని.. అలాగే హమాలీల సమస్యలు తీర్చడం సైతం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా అన్ని తీర్చే బాధ్యత తనది అని చెప్పారు. బీఆర్ఎస్ కు అధికారం లేకపోయినప్పటికి ప్రజల్లో మమకారం మాత్రం పోలేదని అన్నారు. ఈ కష్ట సమయంలో ఎవరైతే BRS పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

