కలం, వెబ్ డెస్క్: ప్రముఖ మళయాల నటుడు మోహన్ లాల్ (Mohanlal) ఇంట్లో ఏనుగు దంతాల కేసుకు సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి అటవీ శాఖ మోహన్ లాల్‌కు క్షమాభిక్ష పెట్టాలని భావించగా కోర్ట్ దానికి బ్రేక్ వేసింది. 2011లో కొచ్చిలోని మోహన్ లాల్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో ఏనుగు దంతాలు బయటపడ్డాయి. దీనిపై అప్పట్లోనే అటవీ శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది.
ఇవి తనకు వారసత్వంగా, గిఫ్టులుగా వచ్చాయని కేరళ అటవీ శాఖ ఇచ్చిన క్షమాభిక్ష కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలు, వాటితో చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని మోహన్ లాల్ ప్రకటించారు. వన్యప్రాణి సంబంధ వస్తువుల విషయంలో నిబంధనలు తనకు తెలియదన్నారు. దీంతో ప్రభుత్వం కేసు ఉపసంహరణకు సిద్ధమైంది.
గతంలో ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా మోహన్ లాల్ (Mohanlal) వద్ద ఉన్న వస్తువులకు ఓనర్ షిప్ డాక్యుమెంట్స్ ఇచ్చింది. అయితే ఆయన నిబంధనలు పాటించలేదనే కారణంతో కేరళ హైకోర్టు (Kerala HC) ఆ డాక్యుమెంట్స్‌ను రద్దు చేసింది. తాజాగా కేరళ ప్రభుత్వం సదరు వన్యప్రాణి వస్తువులను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ కొత్తగా నిబంధనలను సవరించింది. ఈ సవరించిన నిబంధనల కింద మోహన్‌లాల్ తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను డిక్లేర్ చేయడానికి అటవీ శాఖకు తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు.
ఈ కొత్త సవరణలపై పర్యావరణ కార్యకర్తలు మళ్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ నిబంధనలు వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని వారు వాదిస్తున్నారు. ఈ చట్టబద్ధతపై కోర్టు స్టే ఇవ్వనప్పటికీ, ఈ పథకం కింద వచ్చే దరఖాస్తులన్నీ కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో మోహన్‌లాల్ ఏనుగు దంతాల ఓనర్‌షిప్ అటవీ శాఖ పరిశీలనతో పాటు కోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉందని అధికారులు చెప్తున్నారు.
Read Also: దిండు దగ్గర మొబైల్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Follow Us On : WhatsApp

