కలం, జోగుళాంబ గద్వాల: గద్వాల్ (Gadwal) మండలం గోనుపాడు పరిధిలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం గద్వాల ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడపాలని విద్యార్థులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గద్వాల నుండి పాలిటెక్నిక్ కళాశాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజూ రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కళాశాల ప్రారంభమయ్యే సమయానికి, అలాగే ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కళాశాల ముగిసిన తర్వాత గద్వాల్ బస్టాండ్‌కు చేరుకోవడానికి బస్సులు లేక విద్యార్థులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది అని అన్నారు. సాయంత్రం సమయాల్లో కళాశాల నుంచి బస్సులు లేకపోవడంతో విద్యార్థినిలు చీకటి పడేవరకు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని గద్వాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి పాలిటెక్నిక్ కళాశాలకు ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

