కలం, వెబ్ డెస్క్: మనం నివసించే ఇల్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రముఖ వెల్‌నెస్ కోచ్ లూక్ కౌటిన్హో తెలిపారు. ఇంట్లోని ఈ అలవాట్లు (Home Habits) అలసట, ఒత్తిడికి గురిచేయడమో చేస్తాయని పేర్కొన్నారు. రాత్రిపూట ప్రకాశవంతమైన తెల్లటి ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించడం వల్ల మెదడు సహజసిద్ధమైన నిద్రను దూరం చేస్తుంది. కాబట్టి రాత్రి 8 గంటల తర్వాత మసక వెలుతురు లేదా వార్మ్ లైట్లను వాడాలని ఆయన సూచించారు. అలాగే మూసీ ఉన్న కిటికీలు, వంటగది పొగ, అగరుబత్తీల వల్ల ఇంటి లోపలి గాలి నాణ్యతను తగ్గించేలా చేస్తుంది. అందుకే రోజుకు కనీసం రెండుసార్లు కిటికీలు తెరిచి తాజా గాలి లోపలికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీంతో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వెల్లడించారు.
ఇల్లు గందరగోళంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రాత్రిపూట 10 నిమిషాలు ఇల్లు సర్దుకోవడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. అలాగే టీవీలు, సోషల్ మీడియా వల్ల వచ్చే నిరంతర శబ్దాలు నరాల వ్యవస్థను ప్రశాంతంగా ఉండనివ్వవు. శరీరం ఉత్తేజితం కావడానికి రోజుకు 20 నిమిషాల పాటు నిశ్శబ్దంగా గడపాలని కోరారు. ఇక చివరగా పడకగదికి దగ్గరగా ఫోన్లు, వై-ఫై రూటర్లు ఉంచడం, రాత్రి ఆలస్యంగా ఫోన్ స్క్రీన్లు చూడటం నిద్రను పాడుచేస్తుంది. పడుకోవడానికి 30 నిమిషాల ముందే డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆహారం, వ్యాయామంతోనే ఆరోగ్యంగా ఉండలేమని, మనం నివసించే వాతావరణం ప్రశాంతంగా ఉండాలని స్పష్టం చేశారు.

