కలం, కరీంనగర్ బ్యూరో : భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు ‘దొడ్డి కొమురయ్య'(Doddi Komuraiah) ఆశయాల సాధన కోసం నేటి యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ నాయకుడు పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, దొరల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమురయ్య ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి నిర్వహిస్తున్నప్పటికీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఎదుర్కొంటున్న నీళ్లు, నిధులు, నిరుద్యోగం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, మచ్చ రమేష్, బూడిద సదాశివ తదితరులు పాల్గొన్నారు.

