కలం, వెబ్ డెస్క్: అయోధ్య (Ayodhya) నుంచి తీసుకువచ్చిన శ్రీరాముడి బంగారు విగ్రహం, ధనస్సు, పాదుకలు శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఈ పవిత్ర ప్రతీకలను పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ప్రతిష్టించి భక్తులకు దర్శనార్థం ఉంచారు. అయోధ్య శ్రీరాముడి పవిత్ర చిహ్నాలు నిర్మల్‌కు చేరుకోవడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని రాములోరి బంగారు విగ్రహం, ధనస్సు, పాదుకలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పవిత్ర చిహ్నాల రాకతో నిర్మల్ పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు భక్తులు శ్రీరాముని ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

