కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్‌తో (Kheemya Naik) కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే 8 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు, 3 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్‌చైర్‌లు అందజేసి లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Adarsh Surabhi) మాట్లాడుతూ.. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్‌లు వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు స్వావలంబనకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, సీపీఓ హరికృష్ణ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Also: కేసీఆర్‌ను ఉరి తీసినా తక్కువే.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

