కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఖమ్మం (Khammam) జిల్లాకు చేరుకోనున్నారు. రాష్ట్ర పోలీస్(డీజీపీ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఖమ్మం చేరుకున్న అనంతరం డీజీపీ సీవీ ఆనంద్.. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, గంజాయి ఇతర వ్యసనాల నిర్మూలన వంటి పలు కీలక అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సమీక్ష అనంతరం శనివారం రాత్రి ఆయన ఖమ్మంలోనే బస చేస్తారు.
ఆదివారం ఉదయం డీజీపీ ఖమ్మం నుండి బయలుదేరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకుంటారు. శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. డీజీపీ రాకను పురస్కరించుకుని భద్రాచలంలోనూ భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

