కలం, వెబ్ డెస్క్: గూగుల్ (Google) ప్లేస్టోర్, యాపిల్ (Apple) వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను రిమోట్‌గా ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ గూగుల్, యాపిల్‌లకు నోటీసులు జారీ చేసింది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను తమ యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశించింది. మొత్తం 7 యాప్‌లకు సంబంధించి నోటీసులు జారీ చేయగా BAT-BMS, SMART BMS, LOSSIGY వంటి యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ యాప్‌లు బ్లూటూత్ ద్వారా వాహనాల పవర్‌ను నియంత్రించి, కొన్ని సందర్భాల్లో రిమోట్‌గా వాహనాలను ఆపేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన నివేదికలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వీడియోల్లో ఈ-రిక్షాలు అకస్మాత్తుగా ఆగిపోవడం, డ్రైవర్లు మధ్యలో నిలిచిపోవడం చూపించారు. ఈ సందర్భంగా ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఏ యాప్ అయినా కఠిన చర్యలు ఎదుర్కొంటుందని కేంద్రం హెచ్చరించింది.

