కలం, వెబ్ డెస్క్: దేశంలో బంగారం వినియోగంపై కొంతకాలంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే కొత్త బంగారం పథకం (Gold Monetisation Scheme) తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే కార్యాచరణ పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తులు పూర్తి చేసిందని, వచ్చే రెండు మూడు వారాల్లో ప్రకటించబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2015లోనే పథకం వచ్చినా..
2015లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీంను తీసుకొచ్చినా అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేకపోయింది. ప్రజలు తమ వద్ద ఉన్న ఆభరణాలను డిపాజిట్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మింట్ వాటిని కరిగించి కడ్డీలుగా మార్చేది. దీంతో తమ ఆభరణాల రూపం మారిపోతుందనే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అంతేగాకుండా మార్కెట్ రిటర్స్న్‌తో పోలిస్తే.. ఈ పథకంలో వచ్చే వడ్డీ కూడా చాలా తక్కువే. దీంతో అప్పట్లో కేంద్రం ఎంతగా ప్రచారం చేసినా సక్సెస్ కాలేదు.
వడ్డీ రేట్లు పెంచుతూ..
డిపాజిట్ దారులకు పూర్తి భరోసానిస్తూ.. ఎక్కువ వడ్డీ, ఎక్కువ లాభం అనే విధానంతో గోల్డ్ స్కీం (Gold Monetisation Scheme) రూపొందిస్తున్నారని చెబుతున్నారు. వడ్డీ ఎంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అంతేగాకుండా, ఆభరణాల రూపం మార్చకుండా ఉండేలా హామీ ఇవ్వనుందని మరో ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వమే బంగారం ఏడాది పాటు కొనొద్దని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, స్వచ్ఛందంగా డిపాజిట్ చేసేవారికి అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందిస్తోందని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

