కలం, వెబ్ డెస్క్: అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మండిపడ్డారు. తాము వచ్చాకే, రాజధాని నిర్మాణం సహా అన్ని రకాల పనులు జరుగుతున్నాయని వివరించారు. విశాఖతో పాటు ఇక నుంచి రాయలసీమ ఉక్కు ప్రాంతంగా మారబోతుందన్నారు. తీవ్రవాదులతో పోరాడిన చరిత్ర తనకు ఉందని, అలిపిరిలో తన కారుపై బాంబు బ్లాస్ట్ జరిగితే.. వేంకటేశుడే తన ప్రాణాలు రక్షించాడని వివరించారు.
గంజాయి ముఠాలను అణచివేస్తాం..
శాంతి భద్రతల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. గంజాయి ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ఇప్పటివరకు హార్టికల్చర్ హబ్‌గా ఉన్న రాయలసీమ ఇక నుంచి విలువైన ఖనిజాలు, గ్రీన్ ఎనర్జీ, స్టీల్ హబ్‌గా మారబోతుందని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో రాయలసీమలో డ్రోన్స్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీన మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన జరగబోతుందని.. రాయలసీమ ప్రాంతానికి ఇది గేమ్ ఛేంజర్ గా ఉండబోతుందన్నారు. రాయలసీమ ఇక నుంచి కరవు నేల కాదని, జలవనరులు ఎగిసిపడే నేల కానుందని వివరించారు.

