Mobile Popup Ad
Mobile Popup Ad

ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

కలం, నాగర్ కర్నూల్ : ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా డిజిటలైజేషన్ నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం వెలమలపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్.. బూత్ లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి అర్హత కలిగిన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ… ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రతి అధికారిపై ఉన్న బాధ్యత అని అన్నారు. గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించి, ఓటర్లు నింపిన ఫారాలను నిర్ణీత గడువులోగా తిరిగి స్వీకరించాలని సూచించారు. అనంతరం వాటిలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఓటరు వివరాల నమోదు సమయంలో పేర్లు, చిరునామాలు, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, అవసరమైన గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని, చిన్నపాటి తప్పిదాలు కూడా భవిష్యత్తులో సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లను మరోసారి సంప్రదించి వారి నుంచి ఫారాలు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురైతే బీఎల్‌వోలు వారికి సహాయం చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి బూత్ పరిధిలో రోజువారీ పురోగతిని సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని ,ప్రభుత్వ ఆదేశాలు, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, వంగూరు తహసిల్దార్ మురళీమోహన్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>