కలం, వెబ్ డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నందుకు డీఎస్పీ భీమ్‌రెడ్డిని (DSP Bheem Reddy) తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.200 కోట్ల పైమాటే అని తేలింది. ఉదయం 10 గంటల నుంచి 16 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. నాగోల్ లో ఉన్న ఆయన విల్లాలో కిలో బంగారం, రూ.40 లక్షల నగదు గుర్తించారు. కర్ణాటకలో ఆయన భారీగా భూములు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోయారు. 38 ఎకరాల వ్యవసాయ భూమి, మరో చోట ఆరు ఎకరాల భూమి, బెంగళూరు దగ్గర మరో ఎకరం, జహీరాబాద్ సమీపంలో 3.5 ఎకరాల భూమి ఉంది.
ఇవే కాకుండా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓపెన్ ప్లాట్లు, ఎకరాల చొప్పున భూమి ఉన్నట్లు గుర్తించారు. ఒక మైనింగ్ కంపెనీలో రూ.75 లక్షల పెట్టుబడి పెట్టినట్లు కూడా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్ రెడ్డి.. పనిచేసిన చోట్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు కొంతకాలంగా తీవ్ర ఆరోపణలున్నాయి.
దొరికిన డైరీ..
భీమ్ రెడ్డి తనకు ఎక్కడెకక్కడ ఆస్తులున్నాయో.. బినామీలు ఎవరో స్పష్టంగా ఒక డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. అది కాస్తా ఏసీబీ అధికారులకు చిక్కడంతో సోదాలు మరింత సులభమైనట్లు చర్చ జరుగుతోంది. మరో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. డీఎస్పీ అక్రమాస్తుల అంశం శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

