Mobile Popup Ad
Mobile Popup Ad

అనుముల బ్రదర్స్ నిలువునా దోచుకుంటున్నారు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: రెండున్నరేళ్లలో అనుముల బ్రదర్స్ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని.. అదానిని మించిన ఆస్తులు కూడబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్, మంత్రులకు నిజంగానే చర్చించే దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సభలో మైక్ కట్ చేయకుండా తమకు మాట్లాడే అవకాశం ఇస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి బండారాన్ని మొత్తం బట్టబయలు చేస్తామని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు హామీలు, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం నిత్యం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన..

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్లలో మంత్రి కొడుకు, సీఎం అల్లుడి పంచాయతీ భరించలేకే ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశారని ఆరోపించారు. బీర్ల కోసం తెచ్చిన జీఓపై జూపల్లికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం 2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, కాగ్ లెక్కలు చెబుతుంటే.. సీఎం, డిప్యూటీ సీఎంలు పొంతన లేని లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ సమాధానం చెప్పాలి..

అటు బీజేపీ పార్టీపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ‘ఆర్ఆర్ (RR) ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడినా, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన ఈడీ దాడుల విచారణ ఏమైందో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీవి కుమ్మక్కి రాజకీయాలు..

అమృత్ టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలకు అర్థమయిపోయాయని అన్నారు. సీఎం, మంత్రులను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిత్యం నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>