కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (Telangana SEC) రాణి కుముదిని (Rani Kumudini) గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి వనపర్తి (Wanaparthy) జిల్లా శ్రీ రంగాపూర్‌లోని ప్రసిద్ధ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ మొక్కలను అందజేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా ఆలయంలోకి ఆమెను ఆహ్వానించారు.
రాణి కుముదిని కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనాలతో ప్రత్యేక ఆశీర్వాదం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. తర్వాత ఆలయ పరిసరాలను సందర్శించి అక్కడి సహజ సౌందర్యాన్ని వీక్షించారు. ఆలయంలోని మ్యూజియంను సందర్శించి అక్కడ ప్రదర్శించిన చారిత్రక చిత్రాలు, కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, స్థానిక సర్పంచ్ మద్దిలేటి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

