కలం, కరీంనగర్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం.. ప్రాణాలకు గ్యారెంటీ ఉందా? పర్యావరణ హితం అని నమ్మి ఎక్కితే.. ప్రయాణికులకు ఇవి యమపాశాలుగా మారుతున్నాయా? అవుననే అంటున్నాయి వరుసగా జరుగుతున్న ఘోర ప్రమాదాలు! వరుసగా మూడోసారి ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం (Electric Bus Fire) అవడం పరిస్థితి తీవ్రతకు దారి తీస్తోంది. “ఆగుతున్నై.. కాలుతున్నై!” అన్నట్లుగా తయారైంది జేబీఎం (JBM) ఎలక్ట్రిక్ బస్సుల పరిస్థితి.
ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, బస్సుల నుంచి వస్తున్న పొగలు, మంటలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో బస్సు దగ్దం విషయంలో ఎటూ తేల్చకపోగా మరోసారి ఎలక్ట్రిక్ బస్సు మంటల్లో కాలిపోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కరీంనగర్-2 డిపోలో బస్సుల ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేయగా మిగిలిన డిపోల్లో కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ పరిధిలో సుమారు 500 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుంటే, ఒక్క కరీంనగర్ (Karimnagar) రీజియన్ లోనే 104 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, కాలుష్య నివారణ కోసం తీసుకొచ్చిన ఈ బస్సులు ఇప్పుడు ప్రయాణికులకు షాక్ ఇస్తున్నాయి. ప్రధానంగా ఈ బస్సుల్లోని లిథియం అయాన్ బ్యాటరీల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ బ్యాటరీలకు మంటలు అంటుకుంటే, ఆ బ్యాటరీ పూర్తిగా డిస్చార్జ్ అయ్యే వరకు మంటలు ఆర్పడం అసాధ్యం. అలుగునూరు ప్రమాదంలో కూడా ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడానికి, బస్సు పూర్తిగా బూడిద కావడానికి ఈ బ్యాటరీలే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు కొన్ని బస్సులు ప్రతి 20, 30 కిలోమీటర్లకు ఒకోసారి మధ్యలోనే ఆగిపోతుండటం ప్రయాణికులను అసహనానికి గురిచేస్తోంది.
వరుస ఘటనలతో ఆందోళన
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రయాణం ఇప్పుడు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పర్యావరణ హితం, శబ్దం లేని ప్రయాణం అంటూ రోడ్డెక్కిన ఈ బస్సులు.. వరుస ప్రమాదాలతో ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ పరిధిలో జరిగిన ప్రమాదం జేబీఎం (JBM) ఎలక్ట్రిక్ బస్సుల నాణ్యతపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
అసలు ఏం జరుగుతోంది? బస్సులు ఎందుకు తగలబడుతున్నాయి? కరీంనగర్ రీజియన్ లో అసలేం జరుగుతోంది? అన్న ప్రశ్నలకు టీఎస్ ఆర్టీసీ నుంచి మాకు సంబంధం లేదన్న ప్రశ్నే ఎదురవుతోంది. ఈ వరుస ప్రమాదాలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం చాలా సీరియస్‌గా తీసుకుని సంబంధిత సంస్థకు లేఖ రాసింది.
ఇటీవల కరీంనగర్-2 డిపోకు చేరుకున్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ బృందం రెండు రోజులుగా ముమ్మర విచారణ జరిపింది. ఈ కమిటీలో ఇద్దరు అధికారులు హైదరాబాద్‌కు చెందినవారు కాగా, మరో ఇద్దరు ఢిల్లీకి చెందినవారు ఉన్నారు. అంతేకాదు, చైనాకు చెందిన కంపెనీ ఎక్స్పర్ట్ ఒకరు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు.
బస్సులో వైరింగ్ లోపాలు, బ్యాటరీ లోపాలు, బస్సులు తరచూ ఆగిపోవడానికి గల సాంకేతిక కారణాలపై వీరు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఆర్ఎం రాజ్, డిపో మేనేజర్ శ్రీనివాస్ లతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ఈ నివేదికను ఆర్టీసీ ఎండీకి అందజేస్తామని చెప్పారు. ఈ లోపు మరో ఘటన జరిగింది.
వరుస ఘటనలు
- 2023 ఏప్రిల్ 7న హైదరాబాద్ బేగంపేటలో వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి.
- గత ఏడాది జూన్ 28 కరీంనగర్-2 డిపో నుంచి బస్టాండ్‌కు వెళ్లే క్రమంలో స్టార్ట్ చేయగానే పొగలు, మంటలు వచ్చాయి.
- గత ఏడాది సెప్టెంబర్ 4 హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు డిచ్పల్లి మండలం ధర్పల్లి సమీపంలో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై నిలిపివేశారు.
- ఈ యేడాది జూన్ 21న కరీంనగర్ జిల్లాలోని అల్గునూర్ లో ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్దం కాగా డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సేఫ్ అయిన సంఘటన చోటు చేసుకుంది.
- తాజాగా బుధవారం కరీంనగర్-2 డిపోలో చార్జింగ్ పెడుతుండగానే మంటలు వ్యాపించి బస్సు దగ్దమైంది.
లిథియం బ్యాటరీల లోపమేనా?
ఇటీవల జూన్ 21న కరీంనగర్ అలుగునూరు వద్ద జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదానికి గురికావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది. ఫైర్ అలారమ్ మోగడంతో ప్రయాణికులు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు కానీ.. లేదంటే ఊహించని ఘోర కలి జరిగిపోయేది! అసలు కరీంనగర్ రీజియన్‌లో ఏం జరుగుతోంది? లిథియం అయాన్ బ్యాటరీలే ప్రయాణికులకు శాపంగా మారాయా? రంగంలోకి దిగిన ఢిల్లీ, చైనా టెక్నికల్ టీమ్స్ తేల్చబోతున్న నిజాలేంటి? అని తేలలేదు.
కరీంనగర్ టు హైదరాబాద్.. ప్రయాణికుల గుండెల్లో ఇప్పుడు ఈవీ బస్సులు రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కరీంనగర్ అలుగునూరు వద్ద వందలాది మంది చూస్తుండగానే ఓ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా బూడిదైపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా భావిస్తున్నా.. అసలు లోపం ఎక్కడుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇది ఒక్క రోజు సమస్య కాదు.. ఈవీ బస్సుల ట్రాక్ రికార్డ్ చూస్తే ప్రయాణికులు వణికిపోతున్నారు. 2023 బేగంపేట ప్రమాదం నుంచి.. నిన్న మొన్నటి కరీంనగర్, ధర్మారం, టూ డిపోల ఘటనల వరకు వరుసగా పొగలు కక్కుతున్న బస్సులు ప్రయాణికులను రోడ్లపై నరకం చూపిస్తున్నాయి. ప్రతి 20, 30 కిలోమీటర్లకోసారి ఈ బస్సులు ఆగిపోతుండటంతో.. వీటి నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంటలు ఆర్పడం అసాధ్యమా?
లిథియం అయాన్ బ్యాటరీల గుట్టుమట్లు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ బ్యాటరీలకు మంటలు అంటుకుంటే నీళ్లతో గానీ, గ్యాస్ సిలిండర్లతో గానీ ఆర్పడం దాదాపు అసాధ్యం. బ్యాటరీ పూర్తిగా డిస్చార్జ్ అయ్యే వరకు మంటలు ఎగసిపడుతూనే ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 500, ఒక్క కరీంనగర్‌లోనే 104 ఈవీ బస్సులు నడుస్తున్న తరుణంలో.. ఈ వరుస ప్రమాదాలను ఆర్టీసీ తీవ్రంగా పరిగణించింది.
వైరింగ్ లోపాలు, బ్యాటరీ సమస్యలపై విచారణ జరిపేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు చైనా నుంచి వచ్చిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీమ్ కరీంనగర్ డిపోలో జాయింట్ ఎంక్వయిరీ ప్రారంభించారు. ఈ టెక్నికల్ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్టీసీ ఎండీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే మరో బస్సు షార్ట్ సర్క్యూట్ తో దగ్దమవడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం ఈ సాంకేతిక లోపాలను వీలైనంత త్వరగా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

