కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి వేల కోట్లు ఆర్జిస్తూ, అదే ఇసుకను స్థానిక ప్రజలు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే (Huzurabad MLA) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం చెబుతుండగా, మరో వైపు ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నించారు.
ఇసుక కొరతతో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రైవేటు నిర్మాణాలు, కాంట్రాక్టర్ల పనులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని అన్నారు. వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో గతంలో రూ.1,500 నుంచి రూ.2,000కే లభించే ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం రూ.8,000 వరకు చేరిందని అన్నారు. హుజూరాబాద్, కమలాపూర్ ప్రాంతాల్లో ఒక్క ట్రాక్టర్ ఇసుక ధర రూ.8,000 నుంచి రూ.10,000 వరకు పలుకుతోందన్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో లభించే ఇసుకను ముందుగా స్థానిక ప్రజల అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసే వారిని నిర్బంధించడం సరికాదన్నారు. స్థానిక పరిధిలో స్థానిక అవసరాల కోసం ఇసుక తరలింపును అనుమతించాలని, అయితే నియోజకవర్గ సరిహద్దులు దాటి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వం చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రభుత్వం వెంటనే ఇసుక విధానాన్ని పునఃసమీక్షించి, స్థానిక ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ప్రజల హక్కైన ఇసుకను ముందుగా హుజూరాబాద్ ప్రజలకు అందించాలే తప్ప, ప్రజలపై వేల రూపాయల అదనపు భారం మోపవద్దని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

