కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ (Hyderabad)ను ఆధునిక టెక్నాలజీ కూడిన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సిటీలో ట్రాఫిక్ నిర్వహణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మరింత సమర్థవంతంగా మార్చడం, నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిటీ పరిష్కారాలపై ఆలోచనలు మొదలయ్యాయి. యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ‘అనలాగ్’ సీఈవో అలెక్స్ కిప్మాన్, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో సమావేశమై చర్చించారు.
నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ (AI Traffic Signals )ఆధారిత వ్యవస్థతో అనుసంధానం చేయాలని వారికి సీఎం సూచించారు. ట్రాఫిక్ రద్దీని ప్రత్యక్షంగా విశ్లేషించి దానికి తగ్గట్టు సిగ్నళ్లు అటోమేటిక్‌గా పనిచేసే విధానాన్ని అమలు చేయాలన్నారు. వర్షాలు, ఇతర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్‌ను నియంత్రించే టెక్నాలజీని అభివృద్ధి చేయాలని తెలిపారు.
అంబులెన్స్, ఫైర్ టెండర్లకు గ్రీన్ కారిడార్
– ఎమర్జెన్సీ టైమ్‌లో అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేలా గ్రీన్ కారిడార్ విధానంపైనా, ఏఐ వినియోగంతో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను రూపొందించాలన్న అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.
– హైదరాబాద్ సిటీలో సెన్సార్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంతో సురక్షితమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలను అనలాగ్ ప్రతినిధులు వివరించారు. ట్రాఫిక్ అవసరాలకు మాత్రమే కాకుండా విద్యుత్ సరఫరా, వాటర్ సప్లై, పైప్‌లైన్ లీకేజీ.. ఇలాంటివాటిలోనూ ముందుగానే గుర్తించడంపైనా చర్చ జరిగింది.
– అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, పట్టణ సేవలను డేటా ఆధారంగా మరింత సమర్థవంతంగా అందించడం వంటి అంశాలపై ఆ సంస్థల ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల అవసరాలకు అనుగుణంగా కాగ్నిటివ్ సిటీస్ భావనను అమలు చేసే అవకాశాలను వివరించారు.
– ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం, అనలాగ్, మేఘా (ఎంఈఐఎల్) సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పరస్పర సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సీఈఓ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

