కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్‌పై సోషల్ మీడియా, ఇతర మీడియా వేదికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఏరియా హాస్పిటల్‌లో రోగికి కాలం చెల్లిన (ఎక్స్‌పైర్ అయిన) రక్తాన్ని అందించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. వివాదానికి కారణమైన సదరు రక్త యూనిట్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్‌కు చెందినది కాదని, అది ఒక ప్రైవేట్ బ్లడ్ సెంటర్ నుండి సేకరించబడిన యూనిట్ అని ఆయన వివరించారు.
సంబంధిత బ్లడ్ బ్యాగ్‌పై కలెక్షన్ తేదీ 14-06-2026 కాగా, ఎక్స్‌పైరీ తేదీ 19-05-2026గా ముద్రించబడిందని, సాధారణంగా రక్తం సేకరించిన తేదీ కంటే ముందుగా ఎక్స్‌పైరీ తేదీ ఉండడం అసాధ్యమని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. అసలైన ఎక్స్‌పైరీ తేదీ 19-07-2026 కావాల్సి ఉండగా, లేబులింగ్, ప్రింటింగ్ సమయంలో జరిగిన పొరపాటు వల్లే 19-05-2026గా ముద్రితమైందని, ఇది కేవలం లేబులింగ్ లోపం మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్ల రోగికి ఎక్స్‌పైర్ అయిన రక్తాన్ని ఇవ్వలేదని, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈ లేబులింగ్ లోపాన్ని వైద్య శాఖ అత్యంత సీరియస్‌గా పరిగణించిందని, ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందికి ఇప్పటికే మెమో జారీ చేసి వివరణ కోరడం జరిగిందని సూపరింటెండెంట్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించామని, అవసరమైతే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారమవుతున్న అసత్య వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

