జీరో నుంచి రీస్టార్ట్: శ్రేయస్ అయ్యర్

కలం, స్పోర్ట్స్: భారత టీ20 జట్టు ఇప్పుడు జీరో నుంచి కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతోందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తెలిపాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినా, ఇప్పుడు ఆ విజయాలను పక్కన పెట్టి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జట్టు ఆలోచన ఇదేనని వెల్లడించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కూడా ఇదే సందేశాన్ని జట్టుకు ఇచ్చినట్లు అయ్యర్ వివరించాడు. ప్రపంచకప్ విజయం గతం అయిందని, ఇప్పుడు తాను కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అందరూ మళ్లీ జీరో నుంచి ప్రారంభించాలని గంభీర్ చెప్పినట్లు తెలిపాడు.

టీ20 జట్టు కెప్టెన్సీ తనకు అనుకోకుండా రాలేదని అయ్యర్ అన్నాడు. ఐపీఎల్‌తో పాటు భారత జట్టు తరఫున నిలకడగా మంచి ప్రదర్శనలు చేసిన తర్వాత ఈ అవకాశం వస్తుందని ముందే భావించినట్లు చెప్పాడు. అయితే భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం మాత్రం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి భారత జట్టుకు ఆడాలని కలలు కన్నానని, ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తన కెరీర్‌లో ప్రత్యేకమైన క్షణమని చెప్పాడు.

ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన కష్టం మాత్రమే కాకుండా అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు కూడా ఉందని తెలిపాడు. జట్టు మైదానంలో దూకుడుగా, భయపడని ఆటతో కనిపించాలని అయ్యర్ స్పష్టం చేశాడు. ప్రత్యర్థిపై మొదటి నుంచే ఒత్తిడి పెంచే ఆటను ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ప్రతి మ్యాచ్‌ను గెలవాలనే ఆలోచన ప్రతి ఆటగాడిలో ఉండాలని, సవాళ్లను స్వీకరించడానికే తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

కెప్టెన్‌గా అయ్యర్‌కు (Shreyas Iyer) ఆరంభం మాత్రం ఆశించిన విధంగా సాగలేదు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఓడిపోయింది. అయినప్పటికీ ఆ సిరీస్ మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పరిస్థితుల్లో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఆడినందున ఆ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని తెలిపాడు. జట్టులో పరస్పర నమ్మకం, సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

ఐర్లాండ్ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, బౌలింగ్‌లో మంచి సంకేతాలు కనిపించాయని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్‌తో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకోవడంతో పాటు, తాను కోరుకున్న దూకుడు, నిర్భయమైన క్రికెట్‌కు జట్టును అలవాటు చేయడంపై శ్రేయస్ అయ్యర్ దృష్టి పెట్టాడు.

Read Also: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల వెనుక నిజం ఇదే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>