కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) నగరంలోని భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భగత్‌నగర్ (Lions Club Of Bhagatnagar) ఆధ్వర్యంలో డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) డే, పోస్టల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల నిపుణులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. డాక్టర్‌లు భూమిపై కనిపించే దేవుళ్లని, ప్రాణాలను కాపాడుతూ సమాజానికి అందిస్తున్న వారి సేవలు అమూల్యమని కొనియాడారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, సోషల్ మీడియా విస్తరించినా పోస్టల్ శాఖపై ప్రజలలో విశ్వాసం, ఆదరణ ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో, పన్నుల విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్‌ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. నూతన సాంకేతికత, మారుతున్న నిబంధనలకు అనుగుణంగా వారు దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం సేవలందిస్తున్న డాక్టర్‌లు , చార్టెడ్ అకౌంటెంట్‌లు , పోస్టల్ శాఖ సిబ్బందిని సన్మానించడం వారి సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత బాధ్యతతో పనిచేసేందుకు ఇది ప్రోత్సాహాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భగత్‌నగర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తోట భూమేశ్వర్, కార్యదర్శి వాసర్ల రామచంద్రం, కోశాధికారి వెంకటేశ్వర రావుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం సామాజిక సేవను లక్ష్యంగా చేసుకుని బాధ్యతలు స్వీకరించిన వారు క్లబ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని సూచించారు. కరీంనగర్‌లోని లయన్స్ క్లబ్‌లలో భగత్‌నగర్ క్లబ్‌ను ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని యాదగిరి సునీల్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మనోహర్‌తో పాటు సురేష్ నారాయణ్, గాంధీ, సేనారెడ్డి, అంజయ్య, బచ్చు కుమార్, సామ్రాట్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

