కలం, వరంగల్ బ్యూరో : తమ భూమిలో పరాయి వ్యక్తులు పంటను నాశనం చేస్తున్నారని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ బాధితుడిపై స్థానిక ఎస్ఐ బూతు పురాణంతో రెచ్చిపోవడమే కాకుండా, దౌర్జన్యంగా దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి (Duggondi) మండలంలో కలకలం రేపింది. బాధితుడు తోగారు రాజు తెలిపిన వివరాల ప్రకారం… దుగ్గొండి మండలం, దేశాయిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 436/4, 436/6, 436/7 లలో గల 0-22 గుంటల భూమిని గతంలో పబ్లిక్ కోర్ట్ యాక్షన్ ద్వారా తన తండ్రి తోగారు కట్టమల్లు కొనుగోలు చేశారు. నాటి నుండి నేటి వరకు తామే ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని, ప్రస్తుతం అందులో కంది, మక్కజొన్న పంటలు వేశామని రాజు తెలిపారు.
అయితే, మంగళవారం రోజు తోగరు అశోక, మాణిక్యాల రాజు అనే వ్యక్తులు అక్రమంగా భూమిలోకి చొరబడి, ఎదుగుతున్న పంటపై గడ్డి మందు (రసాయనాలు) పిచికారి చేసి సర్వనాశనం చేశారు. దీనిపై భయబ్రాంతులకు లోనైన బాధితుడు వెంటనే 100 కి డయల్ చేయగా, కంట్రోల్ రూమ్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
మొబైల్ లాక్కొని దాడి చేసిన ఎస్ఐ!
కంట్రోల్ రూమ్ సూచనతో బాధితుడు తోగారు రాజు దుగ్గొండి (Duggondi) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ కి కంప్లైంట్ ఇవ్వబోయారు. అయితే న్యాయం చేయాల్సిన ఎస్ఐ, బాధితుడి పట్ల అత్యంత అనాగరికంగా ప్రవర్తించినట్లు రాజు ఆరోపిస్తున్నాడు. బాధితుడి చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని, అత్యంత దారుణమైన బూతులు (భాడ్కావ్ అంటూ) తిడుతూ రాజుపై భౌతికంగా దాడి చేసి కొట్టారని చెబుతున్నాడు.
రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి, నిందితులకు కొమ్ముకాస్తూ తనపై దాడి చేయడంపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోవడమే కాకుండా, స్టేషన్‌లో అవమానానికి, దాడికి గురైన తనకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, సదరు ఎస్ఐ పై, పంటను నాశనం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు తోగారు రాజు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను వేడుకుంటున్నారు.
Read Also: యాదగిరిగుట్ట దేవస్థానం నూతన బోర్డు ఏర్పాటు
Follow Us On: X(Twitter)

