Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా సంఘాలకు శాశ్వత వేదిక.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

కలం, కరీంనగర్ బ్యూరో :  కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వివో మహిళా సమాఖ్య భవనాన్ని(Women Federation Building).. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ప్రారంభించారు. ఈ భవనం గ్రామాభివృద్ధికి, మహిళా సాధికారతకు కీలక కేంద్రంగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, విద్య, వైద్యం తదితర అన్ని రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళా సమాఖ్య భవనం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని, మహిళల ఆర్థికాభివృద్ధికి, గ్రామ ప్రజల ఐక్యతకు ఉపయోగపడే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇకపై మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సులు ఒకే చోట నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. “గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది” అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సమాఖ్య భవనాన్ని గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ వినియోగించుకోవడంతో పాటు పరిరక్షించాలని కోరారు. గ్రామానికి అవసరమైన త్రాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, ఆరోగ్య రంగాలలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందించిన దాతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిగురుమామిడి మండల కేంద్రంలోని నూతన పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 చిగురుమామిడిలో రూ.16 లక్షలతో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన

చిగురుమామిడి మండల కేంద్రంలో రూ.16 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వివో మహిళా సమాఖ్య భవనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మహిళలకు మంత్రి సూచించారు. గ్రామాలలో సామూహిక భోజనాలు, శుభకార్యాల కోసం ప్రభుత్వం స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిందని, వాటినే వినియోగించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

 ఎస్‌ఐఆర్ ఓటరు సవరణ ప్రక్రియపై సమీక్ష

చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్‌ఏలు) మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. 2002, 2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్డీవో షర్మిల, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు , ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>