కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె అర్జిదారులకు హామీ ఇచ్చారు.
జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి సమస్యలను తీర్చేందుకు అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ప్రజల సమస్యలను ఓర్పుగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. పరిష్కారం లేని సమస్యలైతే అందుకు గల కారణాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
ఫైళ్లు పెండింగ్‌లో ఉంచొద్దు..
ప్రజలకు సంబంధించిన ఫైళ్లను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ఫైళ్ల కదలిక నిరంతరంగా కొనసాగాలన్నారు. ప్రజా ఫిర్యాదులు, ప్రజావాణి దరఖాస్తులు, గ్రీవెన్స్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
జూలై 1న నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో పోలీసు, వైద్య, పౌర సరఫరాలు, హౌసింగ్, మున్సిపల్, విద్యుత్, ఉపాధి, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani)లో మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డుల శాఖ, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 137 వినతులను అధికారులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, డీఆర్డీవో నిర్మల, జెడ్పీ సీఈవో, ఇంచార్జి డీపీవో వెంకటరెడ్డి, డీఆర్డీవో నరసింహులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

