కలం, వరంగల్ : సంఘటితంగా పనిచేస్తూ గ్రేటర్ వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న (GWMC Commissioner Venkanna) అధికారులకు సూచించారు. సోమవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో వినతులను స్వీకరించారు. ప్రజల అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత సూచించారు.
అనంతరం వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ (GWMC Commissioner) మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరం ఎక్కడా ముంపునకు గురికాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
కార్పొరేషన్ సమర్థవంతమైన నిర్వహణకు ఆదాయ వనరులు అత్యంత కీలకమని, రెవెన్యూ వసూళ్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల సుస్థిర నిర్వహణకు పన్నుల వసూళ్లు ఆయువు పట్టులాంటివని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల సంపూర్ణ సహకారం అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగులకు విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
నగరాభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో సందర్శనలు చేస్తూ, శాఖల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి పనితీరును పరిశీలిస్తామని తెలిపారు. గ్రేటర్ వరంగల్‌ను పరిశుభ్ర, ప్రణాళికాబద్ధ, ప్రజానుకూల నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డా. రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జి సీపీ రవీందర్ రాడేకర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

