కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. వశిష్ట పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన నోటు పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ తదితర సౌకర్యాలు ఇప్పటికీ అందించడం లేదన్నారు.
అదేవిధంగా పాఠశాలలో సరైన విద్యా బోధనతో పాటు హాస్టల్ వసతి కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

