కలం, కరీంనగర్ బ్యూరో: ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజుల దోపిడీపై జిల్లాలోని విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై పలుమార్లు వివిధ సంఘాలు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు.
అధికారులు విద్యాసంస్థల ఆర్దిక దోపిడీకి సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించాలని పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని , ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల ఎదుట ఫీజుల వివరాలు తెలిపే పట్టికను ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీ అరికట్టాలని డీఎఫ్ఆర్సీ మాత్రమే అనుమతించిన ఫీజులు వసూలు చేయాలని, ఐఐటీ, నీట్, ఒలంపియాడ్ , ఇంటర్నేషనల్ వంటి తోక పేర్లతో నడుస్తున్న విద్యాసంస్థలపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు జులై 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు , కళాశాలలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వాయిల రాజ్ కుమార్, దుప్పటపల్లి మురళి, విద్యార్థి సంఘం నాయకులు కుసుంబ ఆదర్శ్, రవీంద్ర చారి, కట్ట సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

