కలం, వెబ్ డెస్క్: అయోధ్య (Ayodhya) రామ మందిరం విరాళాల లెక్కింపుల్లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు తేలడంతో దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే సిట్ విచారణ చేపట్టి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరికి కోర్ట్ రిమాండ్ విధించగా.. అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల తరఫున వాదించకూడదని తీర్మానించింది. లాయర్లు సైతం ఏకీభవించి.. వారి తరఫున వాదించబోమని తేల్చి చెప్పింది. దీంతో నిందితులకు కోర్టులో న్యాయ పరంగా ఇబ్బందులు కలగబోతున్నాయి.
సంచలనంగా మారిన రికవరీ అంశం..
అయోధ్య నిధుల అవకతవకల అంశంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అవినాశ్ శుక్లా అనే వ్యక్తి నగదు దొంగలించినట్లుగా తెలియడంతో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల మేరకు పోలీసులు, ట్రస్ట్ సిబ్బంది అతడి నుంచి రికవరీ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందే నిందితుడు బ్యాంక్ ఖాతా ద్వారా తిరిగి ట్రస్ట్ ఖాతాకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. అంటే, నిధుల గోల్ మాల్ గురించి ప్రధాన కార్యదర్శి సహా సభ్యులకు ముందే స్పష్టమైన సమాచారం ఉన్నట్లే.. కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ట్రస్ట్ అధికారికంగా ఇంకా స్పందించలేదు.

