కలం, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు (Pebbair) సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) బస్సు సోమవారం బోల్తా పడింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు వెంటనే స్పందించి వారిని పెబ్బేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. కొంతమంది ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోవడంతో సహాయక సిబ్బంది ఎంతో అప్రమత్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే బోల్తా పడిన బస్సును రహదారిపై నుంచి తొలగించారు. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే
అదే సమయంలో అటువైపు వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. స్థానికులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బందితో కలిసి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కృషి చేశారు. గాయపడిన వారిని అంబులెన్సులతో పాటు అవసరమైన చోట్ల పోలీసు వాహనాల్లో కూడా ఆసుపత్రికి తరలించేలా దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడి చికిత్స ప్రక్రియను వేగవంతం చేశారు.
ఈ ఘటనలో పెబ్బేరు ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ కూడా సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు స్థానికులు, రెస్క్యూ సిబ్బందితో కలిసి స్వయంగా సహాయం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించి, క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించే చర్యలను సమన్వయం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్షతగాత్రులకు పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

