కలం, చండూరు: పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత అని చండూరు (Chandur) మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. భారతదేశం పోలియో రహిత దేశంగా కొనసాగేందుకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం అత్యంత కీలకమన్నారు.
గతంలో పోలియో చుక్కలు వేసినా, పూర్తి టీకాలు తీసుకున్న కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరోసారి పోలియో చుక్కలు వేయించాల్సిన అవసరం ఉందన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో అందరం భాగస్వాములం కావాలని, వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి పిల్లల ఆరోగ్యం మన బాధ్యతగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న, కోఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, మొగుదాల సత్తెమ్మ, ఖలీల్, షరీఫ్, మొగుదాల వెంకన్న, స్థానిక పిహెచ్ సి డాక్టర్ మాసరాజు, ఏఎన్ఎం సౌజన్య, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

