కలం, ఖమ్మం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు విని తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కులను హరిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని భవిష్యత్తు తరాలు ఎప్పటికీ క్షమించవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రంగా హెచ్చరించారు. శనివారం భద్రాచలం (Bhadrachalam) నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు వింటూ, తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోగొట్టుకుంటోందని ఆయన మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) గనుక పూర్తైతే భద్రాచలం పట్టణం పూర్తిగా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని పువ్వాడ గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2028-2029 లోపు ఎలాగైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, 50 లక్షల క్యూసెక్కుల నీటిని ఆంధ్ర ప్రాంత ప్రజలకు అందిస్తామని ప్రకటిస్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం భద్రాచలం ముంపు సమస్యపై కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, తక్షణమే పోలవరం ముంపు సమస్యపై సమగ్ర సర్వే నిర్వహించి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు ‘సీతారామ ప్రాజెక్టు’ (Sita Rama Project) ఒక వరప్రదాయని లాంటిదని, ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను, ముఖ్యంగా వెనుకబడిన గిరిజన ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే గొప్ప సంకల్పంతోనే కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర నదీజలాల హక్కులను సాధించాలన్నా, ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని పువ్వాడ స్పష్టం చేశారు.
Read Also: రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర: కేటీఆర్
Follow Us On: X(Twitter)

