కలం, వెబ్ డెస్క్: విదేశాల్లో ఉద్యోగం (Foreign Jobs) చేయాలనుకునేవారికి జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టబడుతోంది. జర్మనీ, ఒమాన్, ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్ దేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ట్రాన్స్‌మిషన్ లైన్ టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, కేర్ గివర్లు, డ్రైవర్లు, నిర్మాణ రంగ కార్మికులు తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఈ నెల 27వ తేదీ వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతోపాటు అవసరమైన పత్రాలు తీసుకువచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, అలాగే 94400 49937, 94400 50951, 94400 49861, 97045 70248, 94400 51452 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను వినియోగించుకుని యువత ఉపాధి పొందాలని కోరారు.

