కలం, వెబ్ డెస్క్: పేరుకే విశ్వనగరం.. కానీ ఆకాశానికి చిల్లు పడి చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు.. హైదరాబాద్ (Hyderabad Traffic) ప్రజల గుండెల్లో వణుకు మొదలవుతోంది. నగరంలో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా అరగంటకుపైగా సమయం పడుతోంది. వాహనదారులు గంటల కొద్దీ రోడ్లపైనే నరకం చూస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్ నిర్వహణ లోపించడంతో నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఏకంగా కార్లే కొట్టుకుపోయాయంటే సిటీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా భాగ్యనగరానికి గుండెకాయ లాంటి ఐటీ కారిడార్‌లో పరిస్థితి దారుణంగా మారుతోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగుల ప్రయాణం నరకప్రాయమవుతోంది. వర్షం పడిన ప్రతిసారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి, కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు.
వర్షం పడినప్పుడు తలెత్తుతున్న ట్రాఫిక్ (Hyderabad Traffic) నరకానికి శాశ్వత పరిష్కారం లభించాలంటే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం, నీరు త్వరగా పోయేలా వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి పరిష్కారాలు చూపడం మొదటి ప్రాధాన్యత కావాలి. ఐటీ కారిడార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో కార్యాలయాల వేళలను మార్చడం, వర్షం పడే సమయంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్‘ను ప్రోత్సహించడం చేయాలి. వీటితోపాటు ప్రజా రవాణా వ్యవస్థను (మెట్రో, బస్సులు) మరింత బలోపేతం చేస్తూ, సిగ్నలింగ్ వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అనుసంధానించాలి. అలాగే ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయంతో ముందే రంగంలోకి దిగితేనే నగరవాసులకు ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధికారుల అలసత్వం, ప్రణాళికా లోపం వల్లే మహానగరం కాస్తా ట్రాఫిక్ నరకంగా మారుతోందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

