కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలోని హోస్పేట్ అరుదైన రాజకీయ ఘటనకు వేదికైంది. తుంగభద్ర (Tungabhadra) ప్రాజెక్టు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యంత్రులు నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్ (DK Shivakumar), చంద్రబాబు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth Reddy) కనిపించడం ఆసక్తికరంగా మారింది. 2024లో వరద ప్రభావానికి తుంగభద్ర డ్యామ్ గేట్లలో ఒకటి కొట్టుకుపోవడంతో, ఈ ప్రాంతంలో సాగునీటి సరఫరా, నీటి నిల్వపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. నిపుణుల కమిటీ దీన్ని పరిశీలించి అన్ని గేట్లు మార్చాలని సూచించింది. దీంతో ప్రభుత్వం యుద్దప్రాతిపదికన రూ.51 కోట్లతో 33 కొత్త గేట్ల ఏర్పాటు పనులను పూర్తి చేశారు.
నేడు ఈ ప్రాజెక్టులో డీకే శివకుమార్ 18వ గేటును, చంద్రబాబు 19వ గేటును, రేవంత్ రెడ్డి 20వ గేటును ప్రారంభించారు. దీనికి ముందు 19వ గేటు వద్ద నిర్వహించిన పూజలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ కొత్త గేట్ల ప్రారంభోత్సవంతో తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని రైతుల్లో, స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు సాగునీరు, తాగునీటి సరఫరాకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది.
కేంద్ర జలశక్తి మంత్రితో ముగ్గురు సీఎంలు భేటీ
గేట్ల ప్రారంభానికి ముందు మూడు రాష్ట్రాల సీఎంలు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక ఐఆర్‌బీ గెస్ట్ హౌస్‌లో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తుంగభద్ర జలాల విషయంలో మూడు రాష్ట్రాల మధ్య నిర్దిష్టమైన వాటాలు ఉన్నప్పటికీ వినియోగంలో తేడాలు వస్తుండడంతో భేదాభిప్రాయాలు తలెత్తాయి. తెలంగాణకు దాదాపు 16 టీఎంసీల నీటి వాటా ఉన్నప్పటికీ కేవలం ఐదారు టీఎంసీలే వినియోగించుకోగలుగుతున్నదని, కర్ణాటక నుంచి నీటి విడుదల తక్కువ కావడంతో ఈ సమస్యలు తలెత్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల మధ్య తుంగభద్ర జలాల విషయంలో అంతర్ రాష్ట్ర వివాదం తలెత్తకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రికి ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. కర్ణాటకలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు లేకుండా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సైతం సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది. దీనికి తోడు తుంగభద్ర బోర్డును పటిష్టం చేసి మూడు రాష్ట్రాల మధ్య ఈ నదీ జలాల విషయంలో గ్యాప్ లేకుండా పకడ్బందీ సమన్వయం ఉండేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో కేంద్ర మంత్రికి సూచించినట్లు తెలిసింది.

