కలం, న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ మనుషుల కంటే తెలివైందిగా మారుతున్నదని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి (UN Research) ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. మనుషుల్లో ఉన్న పక్షపాత ధోరణి, వివక్ష ఏఐ సాంకేతికతకు అంటుకున్నాయని యూఎన్ స్పష్టం చేసింది. ఈ విషయమై పరిశోధకులు మార్కెట్లో ఉన్న 133 ఏఐ సిస్టమ్స్ను పరిశీలించారు. దాదాపు సగం (44%) ఏఐ సిస్టమ్స్ లింగ వివక్షను ప్రదర్శించాయి. నాలుగో వంతు కంటే ఎక్కువ (26% పైగా) సిస్టమ్స్ లింగ వివక్షతో పాటు వర్ణ వివక్షను కూడా చూపించాయి.
మహిళలంటే ఇల్లు, కుటుంబం..
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) నిరంతరం మహిళలను కేవలం ఇల్లు, కుటుంబం, పిల్లల పెంపకానికే పరిమితం చేస్తున్నాయి. అదే సమయంలో పురుషులను వ్యాపారం, లీడర్‌షిప్, విజయవంతమైన కెరీర్‌తో ముడిపెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో.. మహిళలను కేవలం శృంగార వస్తువులుగా లేదా పురుషులకు లొంగి ఉండే సబార్డినేట్లుగా చిత్రీకరిస్తూ ఏఐ సమాధానాలు ఇచ్చింది.
లైంగిక వివక్ష.. ద్వేషం
యూఎన్ విమెన్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక వ్యక్తి జెండర్తో ప్రారంభమయ్యే ఒక సాధారణ వాక్యాన్ని పూర్తి చేయమని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ను కోరగా.. ప్రతి 5 సమాధానాల్లో ఒకటి (20% సమాధానాలు) లైంగిక వివక్షతో లేదా మహిళలపై ద్వేషాన్ని చూపేలా వచ్చాయి. కొన్ని ఏఐ మోడల్స్ అయితే మహిళలను మనుషులుగా కాకుండా ఒక ఆస్తిగా, వస్తువుగా వర్ణించడం రీసెర్చర్లను (AI UN Research) దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివక్షతో కూడిన అల్గారిథమ్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈమెయిల్స్ రాయడానికి, ఆఫీస్ ప్రెజెంటేషన్లు చేయడానికి, సరికొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి, ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ఏఐపైనే ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇటువంటి వివక్షతో కూడిన అల్గారిథమ్‌లతో సమాజంలో ఇప్పటికే ఉన్న అసమానతలు మరింత బలపడే ప్రమాదం ఉందని యునైటెడ్ నేషన్స్ హెచ్చరించింది.
కంటెంట్ కారణంగానే..
ఏఐ ఇలా ప్రవర్తించడానికి కారణం సాఫ్ట్‌వేర్‌లో లోపం కాదని యూఎన్ విమెన్ స్పష్టం చేసింది. ఏఐ మోడల్స్ అన్నీ ఇంటర్నెట్ లోని సమాచారం ఆధారంగానే శిక్షణ పొందుతాయి. కానీ, గత దశాబ్దాలుగా ఇంటర్నెట్‌లో మనుషులు రాసిన కంటెంట్‌లో విపరీతమైన మూస పద్ధతులు, పక్షపాతాలు, వివక్షలు నిండి ఉన్నాయి. ‘‘మహిళలు కేవలం ఇంటికే పరిమితం.. పురుషులు మాత్రమే వ్యాపారాలు చేయాలి”అనే పాతకాలపు ఆలోచనలతో కూడిన టెక్స్ట్ ను చదివి నేర్చుకోవడం వల్లే.. ఏఐ అదే వివక్షను సమాధానాల రూపంలో చెప్తున్నదని యూఎన్ విమెన్ డిజిటల్ టెక్నాలజీస్ లీడ్ జయత్మ విక్రమనాయకే చెప్పారు.
మహిళా జర్నలిస్టులపై ఏఐ వేధింపులు (సిగ్నేచర్)
ఆన్‌లైన్ వేదికలపై మహిళలపై ఇప్పటికే వేధింపులు ఎక్కువగా ఉండగా… ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక వారిపై హింసను సృష్టించడం.. వ్యాప్తి చేయడం మరింత సులభంగా మారిందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురు మహిళా మానవ హక్కుల రక్షకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల్లో ఒకరు (25%) ఏఐ ఆధారిత ఆన్‌లైన్ హింసను ఎదుర్కొన్నారు. వీరిలో 12% మంది వారి అనుమతి లేకుండా పర్సనల్ ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారని చెప్పారు. మరో 6% మంది వారు డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫొటోలు, వీడియోల ద్వారా టార్గెట్ అయ్యామని వెల్లడించారు.
యూనైటెడ్ నేషన్స్ డిమాండ్ ఏంటి?
మహిళలపై వివక్షకు అడ్డుకట్ట వేయాలంటే.. ఏఐ సాంకేతికతను రూపొందించే ప్రారంభ దశ నుంచి దాన్ని మార్కెట్లోకి తెచ్చి.. నియంత్రించే ప్రతి ఒక్క స్టేజీలోనూ లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలు-బాలికల హక్కులను చట్టబద్ధం చేయాలని యూఎన్ విమెన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అలాగే, ఏఐ కేవలం మహిళలపైనే కాకుండా.. వివిధ సామాజిక వర్గాలపై కూడా వర్ణ వివక్షను చూపుతున్నదని పరిశోధకులు కనుగొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

