కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఒక పెద్ద కుట్ర జరుగుతోందని, జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. ఖమ్మం (Khammam) జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. గతంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల సవరణ ప్రక్రియలు జరిగేవని, కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా తమకు నచ్చని వారిని ఓట్ల జాబితా నుంచి తొలగించడానికి ‘SIR’ ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) డేటా ఆధారంగా కాంగ్రెస్ పార్టీని, స్థానిక నాయకులను అభిమానించే వారిని టార్గెట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి, కాంగ్రెస్ మద్దతుదారుల వివరాలను బూత్‌ల వారీగా వేరు చేసి ఆ డేటా ఆధారంగా వారి ఓట్లను తొలగించేందుకు ఒక వ్యవస్థ పనిచేస్తోందని పేర్కొన్నారు. దీనితో పాటు ఒక నిర్దిష్ట పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే సాకుతో ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీ వర్గాల ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, వారి పేర్లను ఓటర్ల లిస్ట్ నుండి తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు ఈ కుట్రను గ్రహించి అప్రమత్తం అయ్యేలోపే పెద్ద ఎత్తున ఓట్లను డిలీట్ చేశారని, దీనివల్ల అక్కడి పార్టీలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ ముప్పు గురించి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎప్పటి నుంచో దేశాన్ని హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రీ-సర్ మ్యాపింగ్, అన్-మ్యాపింగ్ ప్రక్రియలు జరిగాయని, మ్యాపింగ్ లిస్ట్‌లో తమ పేరు ఉంది కదా అని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా సూచించారు.
జూన్ 25 నుంచి జరిగే సవరణ ప్రక్రియలో ప్రతి బూత్ పరిధిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, కాంగ్రెస్ ఓటర్లందరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టెక్నాలజీని వాడుకుంటూ ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు తెరలేపుతున్న తరుణంలో, ప్రతి ఓటును కాపాడుకోవడం ప్రజాస్వామ్య రక్షణకు ఎంతో కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Follow Us On: X(Twitter)

