Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే!

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya Row) ఏర్పాటు అంశం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్రీ విద్యాలయం చుట్టూ “ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే” వివాదం ముదురుతోంది. స్కూల్ భవన నిర్మాణానికి భూమి కేటాయించే విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind), జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఐదెకరాల భూమి సరిపోతుందని ఎమ్మెల్యే అంటుంటే.. భవిష్యత్తు అవసరాల కోసం కనీసం 10 ఎకరాలు కేటాయించాలని ఎంపీ పట్టుబడుతున్నారు. బహిరంగంగా ప్రజల మద్య సమావేశాలలోనే తిట్టుకుంటున్నారు. మంజూరై ఏడాది గడిచినా తరగతులు ప్రారంభం కాకపోవడంతో కేంద్రీయ విద్యాలయం విషయంలో విధ్యార్థులు, వారి తల్లితండ్రులు చీత్కరించుకుంటున్నారు.

జగిత్యాల కేంద్రంగా పొలిటికల్ హీట్..

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పంచాయితీ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సంజయ్‌కి.. అంతకుమించి అన్నట్లుగా అర్వింద్ చేస్తున్న దాడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్నటివరకు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య హద్దులు దాటిన ఆవేశం.. తూటాలను మించి పేలిన మాటలు. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో కథ సుఖాంతం అనుకున్నారంతా ! కట్ చేస్తే ఇప్పుడు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్‌ (MLA Sanjay Kumar)కు మధ్య పోరు మొదలైంది. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ కనిపిస్తోంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ మధ్య తీవ్రమైన రాజకీయ ఆధిపత్య పోరు, మాటల యుద్ధం నడుస్తోంది.

ఒకప్పుడు మంచి సఖ్యతతో ఉన్న వీళ్లిద్దరు.. ఇప్పుడు ఉప్పు, నిప్పు అన్నట్లు మారిపోయినట్లు స్పష్టమవుతోంది. ఒక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి వెళ్లి మరీ.. అభివృద్ధి విషయంలో పలు అంశాలు చర్చించారు. డెవలప్‌మెంట్‌ విషయంలో కలిసి పని చేయడంలో తప్పే లేదంటూ ఇద్దరూ ఉమ్మడిగా పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చారు కూడా! అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగిత్యాల కేంద్రంగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ మధ్య రోజురోజుకు డైలాగ్ వార్ ముదురుతోంది. ఇద్దరి మధ్య తూటాల్లా పేలుతున్న మాటలు.. జగిత్యాల పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయి.

వాదోపవాదాలు..

జగిత్యాల జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya) చుట్టూ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు కోసం కేవలం 5 ఎకరాలు సరిపోవని, కనీసం 10 ఎకరాలు కేటాయించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేస్తుండగా, ఇప్పటికే 5 ఎకరాలు కేటాయించి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీకి అమృత్ పథకం కింద మంజూరైన రూ. 38.5 కోట్ల నిధులపై ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. డబ్బుల కోసమే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. నిధుల వినియోగం, శిలాఫలకాల ఏర్పాటు అంశాలపై ఇరువురు నేతల అనుచరులు, కార్యకర్తల మధ్య జగిత్యాలలో తీవ్ర వాగ్వాదాలు, పోటాపోటీ నినాదాలు జరిగాయి. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్యే సంజయ్, ఆయన అనుచరులు సైతం ఎదురుదాడికి దిగారు.

జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలోని చల్గల్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంస్థ (KVS) కు ప్రతిపాదనలు కూడా పంపినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో విద్యాలయం విస్తరణ, క్రీడా మైదానాలు, హాస్టల్, ఇతర వసతుల కోసం కనీసం 10 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ ఇస్తే ఊరుకునేది లేదని ఎంపీ వర్గం హెచ్చరిస్తోంది.

మరోవైపు చల్గల్‌లోని వాలంతరి క్షేత్రాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగించాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ఐదు ఎకరాలనే ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో పండ్ల వ్యాపారులకు స్థలం కేటాయించినప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు విద్యాలయం కోసం ఎక్కువ భూమి ఇవ్వడానికి ఎందుకు వస్తున్నాయని ఎంపీ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ కేంద్రీయ విద్యాలయం 2025లోనే మంజూరైంది. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాలేదు.

తల్లిదండ్రులు, విద్యార్థుల నిరాశ..

తాత్కాలిక నిర్వహణ కోసం పాత ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్‌ను సిద్ధం చేసినప్పటికీ క్లాసులు మొదలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అద్దె భవనంలోనైనా క్లాసులు ప్రారంభించకపోవడంపై విద్యార్థుల, తల్లిదండ్రుల ఆగ్రహిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతారోపణలు ఎలా ఉన్నా.. భూమి ఎంత అనే చర్చ కంటే ముందు త్వరగా విద్యాలయాన్ని ప్రారంభించి తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్‌లో శాశ్వత భవన నిర్మాణానికి ఏడేళ్లు పట్టిందని.. అప్పటివరకు జగిత్యాలలో కూడా తాత్కాలిక భవనంలోనే తరగతులు ప్రారంభించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి.

శాశ్వత క్యాంపస్ భూమి విషయంలో రాజీ పడకూడదని బీజేపీ పట్టుబడుతోంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలపై కేవీఎస్ (KVS) తీసుకోబోయే తుది నిర్ణయం పైనే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇరు పార్టీల నేతలు రాజకీయం పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్వరగా విద్యాలయాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>