కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఉపాధి కల్పనకు దోహదపడే పీఎంఈజీపి, విశ్వకర్మ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP), ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద పెండింగ్, తిరస్కరించిన దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ బ్యాంకర్లు, దరఖాస్తుదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉపాధి కల్పన పథకాల అమలులో రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి పథకాల లక్ష్యాలను సాధించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో PMEGP పథకం కింద 28 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, 51 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద 76 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, 105 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని వెల్లడించారు. పెండింగ్, తిరస్కరించిన దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
పెండింగ్, తిరస్కరించిన దరఖాస్తులపై బ్యాంకర్లు నేరుగా దరఖాస్తుదారులతో సమన్వయం చేసుకొని అవసరమైన పత్రాలు సేకరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకర్లు, దరఖాస్తుదారులు ఒకే వేదికపై సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం అవుతుందని కలెక్టర్ (Collector Adarsh Surabhi) తెలిపారు. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అధికారి శశికుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
Read Also: తల్లులైనా ఆట ఆగొద్దు: ఐసీసీ కొత్త రూల్స్!
Follow Us On: X(Twitter)

