కలం, నకిరేకల్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రాత్రింబవళ్లు శ్రమించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారి సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) కొనియాడారు. నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల సిబ్బంది, అధికారులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల వడ్లు తడిసి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో అధికారులు, నిర్వాహకులు రాత్రింబవళ్లు పనిచేశారని పేర్కొన్నారు. నేడు రైతులు సంతోషంగా ఉండటం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు అనేక అసత్య ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. ఈ సీజన్‌లో భారీ స్థాయిలో ధాన్యం వచ్చినప్పటికీ, రికార్డు స్థాయిలో వేగంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని వేముల (Vemula Veeresham) స్పష్టం చేశారు.
రైతులు కేవలం దొడ్డు రకాలే కాకుండా, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న సన్న వడ్ల సాగు వైపు మళ్లేలా అధికారులు ప్రోత్సహించాలని, వారికి తగిన అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: తల్లులైనా ఆట ఆగొద్దు: ఐసీసీ కొత్త రూల్స్!
Follow Us On : WhatsApp

