కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా రామడుగు (Ramadugu) మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ మోయీజ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Satyam) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ పెందోట రాజ్ కుమార్, ఏడుగురు వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ పట్టణంలోని తన నివాసంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డులతో పేదలకు సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గృహజ్యోతి లాంటి ఎన్నో సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలోనే గ్రామ అభివృద్ధి సాధ్యం అవుతుందని విశ్వసించి వారితో కలిసి నడవాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే మేడిపల్లి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, రామడుగు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ వార్డు సభ్యులు, ఎండీ ఆరీఫ్, వెంకటేష్, సిరికొండ సాయి తేజ, వెంకటేష్, యాగం రవి, అనిల్ తో పాటు దాదాపు 50 మంది గ్రామ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

