కలం, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ ఫోటో గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను ఆయన బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సామాజిక తెలంగాణ సాధన కోసం జరిగిన లోతైన చర్చల జ్ఞాపకాలను ఈ ఫోటో గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. బహుజన భావజాలం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత తదితర అంశాలే కేంద్రంగా ఆ రోజుల్లో చర్చలు జరిగేవని పవన్ తెలిపారు.
తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు అగస్టీన్, విప్లవ గాయకుడు గద్దర్‌తో కలిసి తెలంగాణ భవిష్యత్తు గురించి, నిష్పక్షపాతంగా రాజకీయ అధికార పంపిణీ జరగాల్సిన ఆవశ్యకత గురించి, సామాజిక తెలంగాణ గురించి తాము తరచూ చర్చించుకునే వాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ఫోటో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందు నాటిదని పవన్ స్పష్టం చేశారు. ఇది తన తండ్రి కొణిదెల వెంకటరావు మరణానంతరం అగస్టీన్, గద్దర్ తమ ఇంటికి పరామర్శ కోసం వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో అని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా, సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని రాజకీయ అధికారంగా మార్చాలనే ఆకాంక్షతో జరిగిన ఆ చర్చలు తనకు ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకమని పవన్ కళ్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఓ బీఆర్ఎస్ నేత ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తుండటంతో పవన్ స్వయంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

