Mobile Popup Ad
Mobile Popup Ad

పిల్లలు చదువులో రాణించాలంటే పాటించాల్సిన స్మార్ట్ స్టడీ టిప్స్

కలం, వెబ్ డెస్క్: చదువులో రాణించడం, అద్భుతమైన విజయాలు సాధించడం అనేది ప్రతి విద్యార్థి ముఖ్య లక్ష్యం, అలాగే ప్రతి తల్లిదండ్రుల కల. నేటి పోటీ ప్రపంచంలో కేవలం కష్టపడి చదవడమే కాకుండా, సరైన ప్రణాళిక, ఏకాగ్రత, స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. అందుకే చదువులో రాణించేందుకు తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని అధ్యయన అలవాట్లు (Study Habits) నేర్పించాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన దినచర్య

పిల్లలైనా, పెద్దలైనా అనుకున్న పనిలో సక్సెస్ సాధించాలంటే సరైన దినచర్య చాలా అవసరం. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన దినచర్య, క్రమశిక్షణ అలవాటు చేయాలి. మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పిల్లలకు సరైన పోషకాహారం అందించాలి.

వ్యాయామం, యోగా

పిల్లలతో రోజూ చిన్నపాటి వ్యాయామాలు, యోగా చేయించాలి. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పిల్లల్లో చదువుకోవాలనే ఆసక్తి కలగడానికి ఇవి చాలా ముఖ్యం.

మానసిక సంసిద్ధత

పిల్లలకు చదువు పట్ల మానసిక సంసిద్ధతను కలిగించాలి. దీనికోసం ప్రతి రోజూ ఒకే సమయానికి చదవడం పిల్లలకు అలవాటు చేయాలి.

కథల పుస్తకాలు చదివించం

సెలవు రోజుల్లో పిల్లలకు ఫోన్లు ఇవ్వడానికి బదులుగా కథల పుస్తకాలు చదివించాలి. దీనివల్ల వారికి భాషపై పట్టు పెరుగుతుంది. అంతే కాకుండా పఠనాసక్తి కూడా కలుగుతుంది.

ప్రశాంత వాతావరణం

పిల్లలు చదువుకొనేటప్పుడు పక్కన కూర్చుని మొబైల్ చూడటం, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే ప్రశాంత వాతావరణంలో పిల్లలు చదువుకునేలా చూడాలి. చదువుకొనేటప్పుడు గాడ్జెట్స్ ను దూరంగా ఉంచాలి. ఈ కాలపు పిల్లలు సమయం దొరికితే చాలు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. పిల్లలు ఎక్కువసేపు ఫోన్లు, టీవీలు చూడకుండా కొన్ని నిబంధనలు పెట్టాలి.

విసుక్కోవద్దు

కొంతమంది పిల్లలు అస్తమానం ఏవో ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లలను విసుక్కోకుండా ఓపికగా సమాధానం చెప్పాలి. దీనివల్ల వారికి విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. నూతన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది.

అభినందించడం

కొన్నిసార్లు పిల్లలు కష్టపడి చదివినా మార్కులు రావు. అలాంటప్పుడు వారిని తిట్టవద్దు. పిల్లలు సాధించిన మార్కుల గురించి కాకుండా వారు కష్టపడి చదివిన విధానాన్ని తల్లిదండ్రులు అభినందించడం చాలా ముఖ్యం. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, చదువుపై ఆసక్తి పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.

సకాలంలో పూర్తి చేయడం

కొంతమంది పిల్లలు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్లినప్పటికీ హోమ్ వర్క్ చేసేందుకు ఇష్టపడరు. అయితే స్కూల్ లో టీచర్ చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఇచ్చిన హోమ్‌వర్క్‌లను సరైన సమయంలో పూర్తిచేయడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి.

ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు పిల్లలకు నేర్పడం వలన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>