కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా చిన్న శంకరంపేట మండలంలో పాత కక్షలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిన ఇద్దరి దారుణ హత్యలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. చిన్న శంకరంపేట మండలం సూరారం (Suraram) గ్రామానికి చెందిన యాట శ్రీధర్ (25) అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి మధ్య పాత కక్షలు ఉన్నాయి. సోమవారం చేగుంట మండలం అనంతసాగర్ వద్ద శ్రీధర్ ఒంటరిగా బైక్ పై వెళ్తున్నాడు. ప్రభాకర్ పథకం ప్రకారం శ్రీధర్‌ను ఆటోతో ఢీకొట్టి దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. శ్రీధర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
శ్రీధర్‌ను హత్య చేసినట్టు తెలియడంతో అతని బంధువులు, గ్రామానికి చెందిన కొందరు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ బంధువులు ప్రభాకర్ ఇంటిపై ప్రతిదాడికి దిగారు. శ్రీధర్‌ను హత్య చేసిన ప్రభాకర్ దొరరక్కపోవడంతో, అర్ధరాత్రి సమయంలో అతని తండ్రి యాదగిరిని దారుణంగా హతమార్చి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సమీపంలోని హల్దీ వాగులో పడేశారు.
కొద్ది గంటల వ్యవధిలోనే గ్రామంలో ఈ జంట హత్యలు జరగడంతో సూరారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు వర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సూరారం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

