ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్‌బుక్‌ల జారీ: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. సోమ‌వారం నాడు రెవెన్యూ అధికారుల‌తో నిర్వ‌హించిన టెలికాన్ఫ‌రెన్స్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు పలుకుతూ రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందే విధంగా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా రూపొందించామని చెప్పారు.

భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత

రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు.

మరింత వేగం పెంచాలి..

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో, ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారని అన్నారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ పూర్తి చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన ద‌ర‌ఖాస్తుల‌ను పరిష్కారించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>