కలం, వెబ్ డెస్క్: క్యాన్సర్ వ్యాధితో తన భార్య చనిపోవడం ఎన్టీఆర్‌ను ఎంతో బాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ రోగులకు అండగా ఉండాలని అప్పుడే కోరుకున్నారని.. బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి ఎందరో దాతలు సహకరించారని గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిని అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారని.. క్యాన్సర్ బాధితుల పట్ల దేవాలయంగా మార్చేశారని కొనియాడారు. మొదటి ట్రస్టీగా వ్యవహరించి కోడెల శివప్రసాద్ బాధ్యాయుతంగా నడిపించి, గొప్ప పునాది వేశారని తెలిపారు. గత 25 ఏళ్లలో ఎన్ని సమస్యలు వచ్చినా బాలకృష్ణ సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆసుపత్రికి రావడం మాత్రం మానుకోరన్నారు. తల్లి పేరిట కొడుకు బాలకృష్ణ.. తండ్రి పేరిట కూతురు భువనేశ్వరీ.. సామాజిక సేవలో ఎన్టీఆర్ కుటుంబానికి సాటి ఎవరూ లేరని మెచ్చుకున్నారు.

