Mobile Popup Ad
Mobile Popup Ad

నేషనల్ డిజైన్ సెంటర్ ఇవ్వండి: మంత్రి శ్రీధర్ బాబు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్య సాధనకు సహకరించాలని కోరారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ.8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ సెంటర్‌ ఏర్పాటుకు హ్యుందాయ్ గ్రూప్ ముందుకొచ్చిందని కేంద్ర మంత్రికి వివరించారు. అక్కడ లాజిస్టిక్ హబ్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. భవ్య పథకం పేజ్ -1లో భాగంగా రాష్ట్రంలో 15 నుంచి 20 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్‌లను సిద్ధం చేస్తోందని తెలిపారు. వీటికి వెంటనే అనుమతి ఇస్తే రాష్ట్రంలో తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఏరో – డిఫెన్స్ కారిడార్‌ మంజూరు చేయండి..

తెలంగాణకు ఏరో – డిఫెన్స్ కారిడార్‌ మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా కోరారు. మెగా లెదర్, ఫుట్‌వేర్ అండ్ యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ (ఎంఎల్ఎఫ్ ఏసీడీ) పథకం కింద రెండు మెగా లెదర్ పార్కులను కేటాయించాలని విన్నవించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో రూ. 2,050 కోట్లతో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) భాగస్వామ్యంతో చేపట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి ‘ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్’ పథకం కింద నిధులను కేటాయించాలన్నారు. పామ్ ఆయిల్ రైతుల కోసం క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను తెలంగాణకే కేటాయించేలా చూడాలన్నారు. గతేడాది ఎరువుల సరఫరాలో అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని శ్రీధర్ బాబు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>